ఏ పాపమెరుగని యో పావన
మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల
కొర కీ పాట్లు నొందినావా
1. ముళ్ళతో కిరీట మల్లి నీ శిరముపై
జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సోమ్మ
సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప||
2. కలువరి గిరి దనుక సిలువ మోయలేక
కలవరము నొందినావా
సిలువ నీతో మోయ తులువలు వేరొకని
తోడుగా నిచ్చినారా ||ఏ పాప||
3. చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు
సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి కడ కేగి సిల్వను
గ్రక్కున దించినావా ||ఏ పాప||
4. ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను
ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు ఆ కొయ్యకే సూది
మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప||
5. పలువిధంబుల శ్రమలు చెలరేగ దండ్రికి
నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ
వలన దాహము నాయెనా ||ఏ పాప||
6. బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్క
జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ
జల్లారె గద కోపము ||ఏ పాప||
7. కట కటా పాప సం కటము బాపుట కింత
పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ యెటువంటిదీ శాంత
మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||
