ప్రేమే శాశ్వతమైన
పరిశుద్ధమైన పొదరిల్లు …. (2)
మనస్సే మందిరమాయే
నా మదిలో దీపము నీవే
నిన్ను ఆశ్రయించిన వారిని
ఉదయించు సూర్యునివలెనే నిరంతరం
నీ మాటతో ప్రకాశింపచేయుదువు ||ప్రేమే||
1. అమరమైన నీ చరితం
విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరిచిన
పరివర్తనక్షేత్రము (2)
ఇన్నాళ్లుగా నను స్నేహించి
ఇంతగ ఫలింపజేసితివి
నీ స్వర సంపదనంతటితో
అభినయించి నే పాడెదను
ఉండలేను బ్రతకలేను
నీ తోడు లేకుండా నీ నీడ లేకుండా ||ప్రేమే||
2. కమ్మనైన నీ ఉపదేశము
విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన వాక్యము
ధైర్యమిచ్చే నా శ్రమలో (2)
కరువు సీమలో సిరులొలికించెను
నీ వాక్య ప్రవాహము
గగనము చీల్చి మోపైన
దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యములు
వివరింప నా తరమా వర్ణింప నా తరమా ||ప్రేమే||
3. విధిరాసిన విషాద గీతం
సమసిపోయే నీ దయతో
సంబరమైన వాగ్ధానములతో
నాట్యముగా మార్చితివి (2)
మమతల వంతెన దాటించి
మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జ్యేష్టులతో
యుగయుగములు నే ప్రకాశించనా
నాపైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు
మరువలేను యేసయ్యా ||ప్రేమే||
